పాలగుమ్మి పద్మరాజు
వికీపీడియా నుండి
పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండొ బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.
పద్మరాజు జూన్ 24, 1915 న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించాడు. ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్. ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్ గా పనిచేశాడు. 1954 లో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వాహినీ పతాకము కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరాడు. దీనితో మొదలుపెట్టి, పద్మరాజు సినీ రంగములో మూడు దశాబ్దాలపాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చాడు.
తన జీవిత కాలములో ఈయన 60 కథలు, ఎనిమిది నవలలు, ముప్పై కవితలు ఇంకా ఎన్నెన్నో నాటికలు మరియు నాటకాలు రచించాడు. ఈయన రచించిన కథ గాలివాన 1952 లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎంపికయిన ఈ పోటీలో భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. ఈ విధముగా తెలుగు కథను ప్రపంచ సాహితీ పటములో నిలిపిన ఘనత ఈయనకే దక్కినది.
పద్మరాజు 1983లో మరణించాడు.