ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి

వికీపీడియా నుండి

కడప పట్టణంలోని నకాష్ వీధి సమీపంలో ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి ఉంది. దీనినే అమీన్ పీర్ దర్గా అంటారు. సాధారణంగా అందరూ పెద్ద దర్గా అంటారు. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 16వ శతాబ్దంలో కడపకు చేరుకున్నాడు. 17వ శాతాబ్దంలో జీవసమాధి అయ్యాడు. ఆయన సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు.ఆయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఈయన కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ తన గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్దదర్గా.

ఈ పెద్ద దర్గాకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాన్యాలున్నాయి. ఆ గురువు సంతతికి చెందినవారు వారసత్వంగా దర్గా పీఠాధిపత్యం చేస్తున్నారు. 8వ గురు పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్తివుల్ ఖాద్రీ హిందీ, అరబ్బీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. 9వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ దర్గాను బాగా అభివృద్ధి చేశాడు. ముఖ ద్వారం నిర్మించాడు. పూర్వసమాధులను పునర్నిర్మించాడు. ముషాయిరా గదిని నిర్మించాడు. ప్రవక్త చిహ్నాలను ప్రదర్శించే భవనాన్ని నిర్మించాడు.

దర్గా ఉరుసు ప్రతి సంవత్సరం ఉర్దూ మాసం 'మదార్ 'లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భక్తులకు సూఫీ ఉపదేశిస్తారు. ముషాయెరా (కవి సమ్మేళనం) ఉంటుంది. దేశం నలుమూలల నుంచి కవులు వస్తారు. హిందువులు, మహమ్మదీయులు అనే భేద భావం లేకుండా ఈ ఉరుసులో సర్వులూ పాల్గొంటారు. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావం ఇక్కడ గుబాళిస్తుంది. ఈ పెద్ద దర్గాకు రెండు శాఖలున్నాయి. నందలూరులో ఒకటి, రెండోది చిత్తూరు జిల్లా పెద్దమండెం మండలంలోని కలిచెర్ల గ్రామంలో ఉంది.