గుండ్లకమ్మ
వికీపీడియా నుండి
గుండ్లకమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రవహించే నది. కృష్ణా నది మరియు పెన్నా నది మధ్య స్వతంత్రముగా తూర్పు ప్రవహించే చిన్న నదులలోకెల్లా ఇదే పెద్దది.
ఇది కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో నల్లమల్ల కొండలలోని గుండ్ల బ్రహ్మేశ్వరము వద్ద 800 మీటర్ల ఎత్తులో పుడుతుంది. కొండలనుండి కిందకు దిగి పల్లపు ప్రాంతానికి రాగానే ఇది కంభం చెరువును, మార్కాపురం చెరువును యేర్పరచుతుంది. ఆ తరువాత ఈశాన్యముగా ప్రవహించి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. గుంటూరు జిల్లాలో తిరిగి దిశమార్చుకొని ఆగ్నేయముగా ప్రవహించి ఒంగోలు మండలము, ఉలిచి గ్రామము వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
చామవాగు, రాళ్లవాగు, పొగుల్లవాగు, దువ్వలేరు, జంపాలేరు, తీగలేరు, కోనేరు మరియు చిలకలేరు గుండ్లకమ్మ యొక్క ఉపనదులు. ఈనది మొత్తం పొడవు 220 కిలోమీటర్లు.
2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా చిన్న మల్లవరం వద్ద గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టును 165.22 కోట్ల ఖర్చుతో నిర్మాణము చేపట్టడానికి ఆమోదము తెలియజేసినది. ఈ ప్రాజెక్టు 6 మండలాల పరిధిలోని 43 గ్రామాలలో 80,060 ఎకరాల భూమికి సాగునీటిని అందివ్వగలదని ఆశిస్తున్నారు. అంతేకాక జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలుతో సహా 23.56 లక్షల మంది ప్రజలకు మంచినీటిని సమకూర్చుతుందని ఆశిస్తున్నారు.
[మార్చు] మూలాలు
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |