విమానం గాలిలో ఎగురుతూన్నప్పుడు తలుపు తెరుచుకుంటే ఏమవుతుంది?
వికీపీడియా నుండి
విమానం గాలిలో ఎగురుతూన్నప్పుడు తలుపు తెరుచుకుంటే ఏమవుతుంది? విమానం ఎగురుతూన్నప్పుడు విమానం తలుపు తెరవటం దరిదాపు అసాధ్యం. దరిదాపు అని ఎందుకన్నానంటే తలుపు కట్టడిలో ఏదైనా లొసుగు ఉన్నా, దుండగులు ఎవ్వరైనా మందుగుండు సామాను పెట్టి పేల్చేసినా తలుపు తెరుచుకోవచ్చు. అసాధ్యం అని అనటానికి రెండు కారణాలు. ఒకటి, విమానం తలుపులు లోపలికి తెరుచుకుంటాయి, అవి బయటకి వెళ్ళలేవు. రెండు, విమానాలు సాధారణంగా 30,000 అడుగులు (లేదా 10,000 మీటర్లు) ఎత్తున ఎగురుతాయి. ఆ ఎత్తున, వాతావరణం ఒత్తిడి చదరపు అంగుళానికి 3 పౌనులు మాత్రమే. సముద్ర మట్టంలో ఈ ఒత్తిడి 14 పౌనులు. విమానంలో ప్రయాణీకులకి సుఖంగా ఉండటం కొరకు లోపల కృత్రిమంగా 11 పౌనుల ఒత్తిడి సృష్టిస్తారు. అంటే పైనుండి వాతావరణం తలుపుని 3 పౌనుల శక్తితో ఒత్తుతూ ఉంటే లోపలనుండి 11 పౌనుల శక్తితో లోపలి గాలి ఒత్తుతోంది. అంటే లోపలనుండి బయటకి తోసే ఒత్తిడి నికరంగా చదరపు అంగుళానికి 8 పౌనులు. ఒక్కో తలుపు వైశాల్యం దరిదాపు 650 చదరపు అంగుళాలు ఉంటుంది. కనుక ఆ తలుపు మీద ఒత్తిడి రెండున్నర టన్నులు. ఎగురుతూన్న విమానం తలుపు తియ్యాలంటే ఆ తలుపు రెండున్నర టన్నుల బరువు ఉన్నట్లు మనకి అనిపిస్తుంది. (ఈ లెక్కలన్నీ మెట్రిక్ పద్ధతిలో చెయ్యనందుకు క్షమించండి.)